royalpost.co.in Latest Telugu News Today | Breaking News in Andhra & Telanganaమున్సిపాలిటీలో తీవ్రమైన కోతుల బెడద.. భయాందోళనలో స్థానిక ప్రజలు › e-Paper Clip royalpost.co.in Latest Telugu News Today | Breaking News in Andhra & Telangana
Share: f 𝕏 in @
royalpost.co.in 13 Sep 2026, 11:46 pm
Date of Publish : 22 Jun 2026, 12:45 pm  |  Posted by : FASIUDDIN MOHAMMED
👁 62 💬 8
Latest News > తెలంగాణ > సిద్దిపేట

మున్సిపాలిటీలో తీవ్రమైన కోతుల బెడద.. భయాందోళనలో స్థానిక ప్రజలు

మున్సిపాలిటీలో తీవ్రమైన కోతుల బెడద.. భయాందోళనలో స్థానిక ప్రజలు

గజ్వేల్, 22 జూన్ 2026 రాయల్ పోస్ట్ న్యూస్ /సిద్దిపేట జిల్లా పరిధిలోని గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీలో గత కొంతకాలంగా కోతుల బెడద అత్యంత తీవ్ర రూపం దాల్చింది. పట్టణంలోని పలు వార్డులు, ప్రధాన వీధుల్లో వానర మూకలు గుంపులు గుంపులుగా సంచరిస్తూ స్థానిక ప్రజలను, వ్యాపారులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. ఎప్పుడు ఏ వైపు నుంచి కోతులు వచ్చి దాడి చేస్తాయోనని జనం వీధుల్లోకి రావడానికే జంకుతున్నారు. పట్టణంలోని కాలనీలలో కోతులు ఇళ్లపైకి చేరి గుమ్మాల ముందు, మిద్దెల పైన తిష్ట వేస్తున్నాయి. తలుపులు కాస్త తెరిచి ఉంచినా ఇళ్లలోకి చొరబడి వంట సామాగ్రిని, ఆహార పదార్థాలను ఎత్తుకెళ్తున్నాయి. అలాగే ఇళ్ల ముందు ఆరబెట్టిన బట్టలను చింపివేస్తూ, డాబాలపై ఉన్న మంచినీటి ట్యాంకుల పైపులను, కేబుల్ వైర్లను ధ్వంసం చేస్తున్నాయి. ఇళ్లలోని పూల మొక్కలు, పెరటి తోటలను సైతం వానర గుంపులు పాడుచేస్తున్నాయి. రోడ్లపై ఒంటరిగా వెళ్తున్న మహిళలు, చిన్నపిల్లలు, వృద్ధులపై కోతులు గుంపులుగా దాడులకు తెగబడుతున్నాయి. చేతిలో కవర్లు, తినుబండారాలు కనిపిస్తే చాలు లాక్కునేందుకు ప్రయత్నిస్తూ గాయపరుస్తున్నాయి. స్కూళ్లకు వెళ్లే చిన్నపిల్లలు ఈ కోతుల సంచారంతో తీవ్ర భయాందోళనకు లోనవుతున్నారు. కిరాణా దుకాణాలు, పండ్ల వ్యాపారుల పరిస్థితి మరింత దారుణంగా మారింది. వ్యాపార సముదాయాల ముందు ఉంచిన వస్తువులను కోతులు ఎత్తుకెళ్తుండటంతో వ్యాపారులు నష్టపోతున్నారు. ఈ సమస్యపై స్థానిక కాలనీ వాసులు మున్సిపల్ అధికారులకు పలుమార్లు విన్నవించినప్పటికీ ఎలాంటి ఫలితం లేకుండా పోయిందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా మున్సిపల్ పాలకవర్గం, అటవీ శాఖ అధికారులు తక్షణమే స్పందించాలని స్థానికులు కోరుతున్నారు. ప్రత్యేక కోతులు పట్టే బృందాలను రంగంలోకి దించి, వీటిని బంధించి దట్టమైన అటవీ ప్రాంతంలో వదిలిపెట్టాలని, తమకు ఈ వానర విపత్తు నుండి విముక్తి కల్పించాలని గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ ప్రజలు గట్టిగా డిమాండ్ చేస్తున్నారు.