రాయల్ పోస్ట్ న్యూస్ భువనగిరి జూన్ 21/ నరుని నారాయణునిగా, నారీని శ్రీ మహాలక్ష్మిగా మార్చడమే బ్రహ్మకుమారీల ఏకైక లక్ష్యమని, పునర్జన్మల కారణంగా మానవుడు కోల్పోయిన దైవీ గుణాలను తిరిగి పొందడం, తమోగుణి కలియుగాన్ని సతోగుణి స్వర్ణిమ యుగంగా మార్చడం కేవలం రాజయోగాభ్యాసం ద్వారా మాత్రమే సాధ్యమౌతుందని బ్రహ్మ కుమారీస్ భువనగిరి ఇంచార్జ్ చంద్రావతి దాదీ అన్నారు. ప్రజాపిత బ్రహ్మకుమారీ ఈశ్వరీయ విశ్వవిద్యాలయం, వాసవిక్లబ్ భువనగిరి శాఖల సంయుక్త ఆధ్వర్యంలో ఆదివారం ఇంటర్నేషనల్ యోగ దినోత్సవాన్ని స్థానిక హౌసింగ్ బోర్డ్ కాలనీలో గల బ్రహ్మకుమారీస్ సెంటర్లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మానవులు మాధవులుగా మారే రోజు త్వరలోనే రానుందని తెలిపారు. స్వర్ణిమ భారతదేశంలోని మౌంట్ అబూ కేంద్రంగా పనిచేస్తున్న బ్రహ్మకుమారీస్ సంస్థ విశ్వంలోని రెండు వందల దేశాలకు పైగా విస్తరించిందని తెలిపారు. విశ్వాత్మలందరూ పరంపిత శివ పరమాత్మ సంతానమని, ఆత్మిక స్వరూపంలో అందరూ సోదరీ సోదరులను తెలిపారు. పవిత్రత సుఖశాంతులకు జనని అని తెలిపారు. బ్రహ్మచర్యం, పవిత్రత ఆధారంగా విశ్వ పరివర్తనకై బ్రహ్మకుమారీలు గత 90 సంవత్సరాలుగా "అవినాశి రుద్రగీతా జ్ఞానయజ్ఞం" ను నిర్వహిస్తున్నారు అని తెలిపారు. బ్రహ్మ కుమార్ రామేశ్వర్ బాయ్ మాట్లాడుతూ ఆత్మ పరమాత్మల సంబంధాన్ని అనుభవం చేసుకోవడమే రాజయోగమని తెలిపారు. అన్ని యోగాల్లోకెల్లా రాజయోగం సర్వ శ్రేష్టమైనదని తెలిపారు. రాజయోగ అభ్యాసం చేయాలనుకునే వారికి స్థానిక బ్రహ్మకుమారీ సెంటర్లో ఉచితంగా శిక్షణ ఇవ్వడం జరుగుతుందని, అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. వాసవి క్లబ్ అధ్యక్షులు లక్ష్మయ్య మాట్లాడుతూ బ్రహ్మకుమారీ సంస్థతో కలిసి యోగ డే నిర్వహించుకోవడం సంతోషంగా ఉందన్నారు. మానసిక ఆరోగ్యానికి రాజయోగం, శారీరక ఆరోగ్యానికి యోగాసనాలు, ప్రాణాయామాలు అవసరమని తెలిపారు. అనంతరం పలు రకాల తేలికపాటి వ్యాయామాలు, యోగాసనాలు, ఎక్సర్సైజులు చేశారు. ఈ కార్యక్రమంలో వాత్సల్య ఇంజనీరింగ్ కళాశాల కరస్పాండెంట్ దరిపల్లి ప్రవీణ్ కుమార్, రిటైర్డ్ ఎమ్మార్వో మోహన్ రెడ్డి, బికె జహంగీర్ కుమార్, బికె ప్రేమలత, బికె లావణ్య, బికె రాధమ్మ, బికె సుశీల తదితరులు పాల్గొన్నారు.