

బాల్యవివాహాల చట్టంపై అవగాహన కల్పిస్తున్న సర్పంచ్ ఐలయ్య
బాల్య వివాహ బంధనాలకు చెక్..
రాయల్ పోస్ట్ న్యూస్ గుండాల, మే 27 : సమాజంలో ఇంకా వేరూనుకుని ఉన్న బాల్య వివాహాల దురాచారానికి ముగింపు పలకాలని, చట్టాన్ని అతిక్రమించి మైనర్లకు పెళ్లిళ్లు చేస్తే కఠిన చర్యలు తప్పవని గుండాల సర్పంచ్ దేవనబోయిన ఐలయ్య హెచ్చరించారు. స్థానిక మండల పరిషత్ అభివృద్ధి అధికారి (ఎంపీడీఓ) కార్యాలయంలో ఐసీడీఎస్ ఆధ్వర్యంలో ‘ప్రజా పాలనా ప్రగతి ప్రణాళిక’ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పనిచేసే చోట మహిళలపై లైంగిక వేధింపుల నిరోధక చట్టం (పోష్ యాక్ట్-2013), బాల్య వివాహాల నిర్మూలనపై విస్తృతంగా అవగాహన కల్పించారు. సర్పంచ్ ఐలయ్య మాట్లాడుతూ.. మండల పరిధిలో ఎక్కడా చిన్నపిల్లలకు పెళ్లిళ్లు జరగకుండా ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలన్నారు. వివాహాలు నిశ్చయించే సమయంలోనే పురోహితులు, చర్చి ఫాదర్లు, ముస్లిం మత పెద్దలు ఖచ్చితంగా వయస్సు ధృవీకరణ పత్రాలను (ఏజ్ సర్టిఫికేట్) పరిశీలించాలని సూచించారు.
సహించేది లేదు: ఎస్ఐ శోభన్ బాబుస్థానిక సబ్ ఇన్‌స్పెక్టర్ శోభన్ బాబు మాట్లాడుతూ.. చట్ట ప్రకారం అమ్మాయికి 18 ఏళ్లు, అబ్బాయికి 21 సంవత్సరాలు నిండిన తర్వాతే వివాహం చేయాలన్నారు. చిన్న వయస్సులోనే పెళ్లిళ్లు చేయడం వల్ల కలిగే శారీరక, మానసిక అనర్థాలను వివరించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే ఎంతటి వారైనా సహించేది లేదని స్పష్టం చేశారు. అలాగే ఉద్యోగ, ఉపాధి ప్రదేశాల్లో మహిళలు ఎలాంటి వేధింపులు ఎదుర్కొన్నా చట్టపరమైన రక్షణ లభిస్తుందని భరోసా ఇచ్చారు. బాధితులు తక్షణ సహాయం కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన 100, 112 (పోలీస్), 181 (మహిళా హెల్ప్‌లైన్), 1098 (చైల్డ్ హెల్ప్‌లైన్) నంబర్లను ఆశ్రయించాలని అవగాహన కల్పించారు. ఈ సదస్సులో డిప్యూటీ తహసీల్దార్ నీలిమ, ఎంపీఓ సలీం, సీడీపీఓ నాజి, ఉప సర్పంచ్ సాయి కుమార్, సూపర్ వైజర్లు శమీమ్, యాకు పాషా, అనిల్ కుమార్, పాస్టర్ వెంకటేశ్వర్లు, అంగన్‌వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు.