నిరుద్యోగ యువతకు టీఆర్‌ఎస్ చేయూత.. ఉచిత కానిస్టేబుల్ శిక్షణతో ఉద్యోగాల బాట

Fasiuddin Mohammed
2 Min Read

పేద, మధ్యతరగతి యువతకు ఉచిత శిక్షణ, అధ్యయన సామగ్రి

అవకాశాలను అందిపుచ్చుకొని, యువత కలలను సాకారం చేసుకోవాలి: టిఆర్ఎస్ రాష్ట్ర నేత లయన్ డాక్టర్ వెంకటేశ్వర్ రావు

వరంగల్, ఆగస్టు 20 రాయల్ పోస్ట్ న్యూస్ /

ఉద్యోగం కోసం కష్టపడుతున్న యువతకు నాణ్యమైన శిక్షణ అందించి పోలీసు శాఖలో అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో తెలంగాణ రక్షణ సేన (టీఆర్‌ఎస్) పార్టీ మరో ముందడుగు వేసింది. హనుమకొండలో ఉచిత కానిస్టేబుల్ శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించి, ఆర్థికంగా వెనుకబడిన అభ్యర్థులకు శిక్షణ, శారీరక సాధన, అధ్యయన సామగ్రిని ఉచితంగా అందజేస్తోంది. తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితమ్మ ఆదేశాల మేరకు గ్రేటర్ వరంగల్ టీఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షులు డాక్టర్ నడిపెల్లి వెంకటేశ్వర్ రావు ఆధ్వర్యంలో హనుమకొండలోని పాత్‌ఫైండర్ ప్రవేశ పరీక్షల కళాశాలలో ఉచిత కానిస్టేబుల్ శిక్షణ కార్యక్రమాన్ని ఘనంగా ప్రారంభించారు. ప్రతిరోజూ మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు తరగతులు నిర్వహించనున్నట్లు తెలిపారు.
ఈ సందర్భంగా డాక్టర్ నడిపెల్లి వెంకటేశ్వర్ రావు మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాలకు చెందిన పేద, మధ్యతరగతి కుటుంబాల యువతలో ప్రతిభకు కొదవ లేదని, సరైన మార్గదర్శకత్వం, నాణ్యమైన శిక్షణ లభిస్తే ప్రభుత్వ ఉద్యోగాలను సులభంగా సాధించగలరని పేర్కొన్నారు. ఆ లక్ష్యంతోనే పూర్తిగా ఉచితంగా శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు తెలిపారు. లిఖిత పరీక్షతో పాటు శారీరక సామర్థ్య పరీక్షలను దృష్టిలో పెట్టుకుని ప్రత్యేక శిక్షణ అందిస్తున్నామని, అనుభవజ్ఞులైన అధ్యాపకుల పర్యవేక్షణలో బోధన కొనసాగుతుందని చెప్పారు. అభ్యర్థులకు అవసరమైన అధ్యయన సామగ్రి, నమూనా పరీక్షలు, సందేహ నివృత్తి తరగతులు, గ్రౌండ్ ప్రాక్టీస్ కూడా ఉచితంగా అందిస్తున్నామని వెల్లడించారు. పోలీసు ఉద్యోగం సాధించడం ద్వారా యువత తమ కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించడంతో పాటు సమాజ సేవ చేసే అవకాశం లభిస్తుందని పేర్కొంటూ, ప్రతి అభ్యర్థి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో టీఆర్‌ఎస్ పార్టీ వరంగల్ జిల్లా నాయకులు ఎస్. కిషోర్, ఏ. లత, పి. సుతేజ్, డి. గణేష్, వి. నిశాంత్ రావు, ఎల్.ఎస్. నాయక్ తదితరులు పాల్గొన్నారు.

📄 Generate e-Paper Clip
Share This Article