ప్రతిభకు పురస్కారం… పేద విద్యార్థులకు చేయూత……వెలమ సంక్షేమ సంఘం నుంచి రూ.12.20 లక్షల స్కాలర్‌షిప్‌లు

Fasiuddin Mohammed
2 Min Read

ప్రతిభకు పురస్కారం… పేద విద్యార్థులకు చేయూత

వెలమ సంక్షేమ సంఘం నుంచి రూ.12.20 లక్షల స్కాలర్‌షిప్‌లు

215 మంది విద్యార్థులకు ఆర్థిక సహాయం.. 65 మందికి ప్రతిభా అవార్డులు

విద్యార్థుల విజయమే సంఘానికి నిజమైన గౌరవం – డా. నడిపెల్లి వెంకటేశ్వర్ రావు

హనుమకొండ, ఆగస్టు 16: రాయల్ పోస్ట్ న్యూస్ /
సమాజంలో ప్రతిభావంతులైన విద్యార్థులను ప్రోత్సహించడంతో పాటు ఆర్థికంగా వెనుకబడిన వారికి చేయూతనందించాలనే లక్ష్యంతో ఉమ్మడి వరంగల్ జిల్లా వెలమ సంక్షేమ సంఘం నిర్వహించిన ప్రతిభా పురస్కారాలు–స్కాలర్‌షిప్‌ల ప్రదానోత్సవం ఆదివారం ఘనంగా జరిగింది. వీఎస్‌ఎస్ ప్రాంగణంలో జరిగిన ఈ కార్యక్రమం విద్యార్థుల్లో నూతన ఉత్సాహాన్ని నింపింది.
వెలమ సంక్షేమ సంఘం అధ్యక్షులు డా. నడిపెల్లి వెంకటేశ్వర్ రావు అధ్యక్షతన జరిగిన కార్యక్రమానికి తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎన్నమనేని జగన్ మోహన్ రావు ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులను అభినందించారు. ఈ సందర్భంగా 65 మంది విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు, 215 మంది విద్యార్థులకు రూ.12.20 లక్షల స్కాలర్‌షిప్‌లు అందజేశారు. విద్యార్థుల ప్రతిభను ప్రోత్సహిస్తూ, వారి ఉన్నత విద్యకు ఆర్థిక భరోసా కల్పిస్తున్న వెలమ సంక్షేమ సంఘం సేవలను పలువురు కొనియాడారు. ఎన్నమనేని జగన్ మోహన్ రావు మాట్లాడుతూ.. ప్రతిభను గుర్తించి ప్రోత్సహించే ఇలాంటి కార్యక్రమాలు యువతలో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయని అన్నారు. సమాజంలోని ప్రతి వర్గం విద్యాభివృద్ధికి తోడ్పడితేనే దేశం మరింత అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు. ఉన్నత విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులు తమ లక్ష్యాలను సాధించి సమాజానికి ఆదర్శంగా నిలవాలని ఆకాంక్షించారు.
డా. నడిపెల్లి వెంకటేశ్వర్ రావు మాట్లాడుతూ.. విద్యార్థుల విజయమే వెలమ సంక్షేమ సంఘానికి నిజమైన గుర్తింపు అని అన్నారు. చదువులో ప్రతిభ కనబరిచే ప్రతి విద్యార్థికి సంఘం అండగా నిలుస్తుందని, భవిష్యత్తులో స్కాలర్‌షిప్‌ల సంఖ్యను మరింత పెంచే దిశగా కృషి చేస్తామని తెలిపారు. విద్యతో పాటు విలువలు, క్రమశిక్షణ కూడా ప్రతి విద్యార్థి జీవితంలో ముఖ్యమని సూచించారు. స్కాలర్‌షిప్‌లు అందుకున్న విద్యార్థులు, వారి తల్లిదండ్రులు సంఘానికి కృతజ్ఞతలు తెలుపుతూ.. ఈ ఆర్థిక సహాయం తమ విద్యాభ్యాసానికి ఎంతో తోడ్పాటునిస్తుందని ఆనందం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో సంఘం కమిటీ సభ్యులు, ప్రముఖులు, 500 మందికి పైగా విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. అనంతరం అందరికీ భోజన వసతి ఏర్పాటు చేశారు.

📄 Generate e-Paper Clip
Share This Article