ప్రజలతో మమేకమే ప్రాధాన్యం.. చిర్ర నాగరాజ్ గౌడ్ చిల్పూర్ మండల కాంగ్రెస్ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరణ…నియామక పత్రం అందజేసిన ఎంపీ డాక్టర్ కడియం కావ్య, డీసీసీ అధ్యక్షురాలు లకావత్ ధన్వంతి

Fasiuddin Mohammed
2 Min Read

రాయల్ పోస్ట్ న్యూస్ హనుమకొండ, ఆగస్టు 09:
ప్రజల సమస్యలను తెలుసుకుంటూ, వారికి అందుబాటులో ఉంటూ సేవలందించడమే తన ముందున్న ప్రధాన కర్తవ్యమని చిల్పూర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చిర్ర నాగరాజ్ గౌడ్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ జిల్లా కమిటీ సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమం సందర్భంగా చిర్ర నాగరాజు గౌడ్ చిల్పూర్ మండల అధ్యక్షుడిగా కొత్త బాధ్యతలు స్వీకరించారు. జనగామ జిల్లా కేంద్రంలోని భ్రమరాంబ ఫంక్షన్ హాల్‌లో శనివారం నిర్వహించిన కార్యక్రమంలో వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య, జనగామ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు లకావత్ ధన్వంతి చేతుల మీదుగా చిర్ర నాగరాజ్ గౌడ్ నియామక పత్రాన్ని అందుకున్నారు. అనంతరం వారి సమక్షంలో మండల అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా నాగరాజ్ గౌడ్ మాట్లాడుతూ.. తనకు అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తానని తెలిపారు. మండలంలోని ప్రతి గ్రామంలో పార్టీ కార్యకర్తలు, నాయకులతో సమన్వయం చేసుకుంటూ ప్రజలకు చేరువగా పనిచేస్తానన్నారు. ప్రజల నుంచి వచ్చే సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తానని చెప్పారు.
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకు చేరడం అత్యంత ముఖ్యమని పేర్కొన్న నాగరాజ్ గౌడ్.. అర్హులైన ప్రతి కుటుంబానికి ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు అందేలా గ్రామస్థాయిలో అవగాహన కల్పిస్తానన్నారు. ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు, ప్రజల అవసరాలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లే బాధ్యతను కూడా నిర్వర్తిస్తానని తెలిపారు.
చిల్పూర్ మండల కాంగ్రెస్ అధ్యక్షుడిగా అవకాశం కల్పించిన పార్టీ నాయకత్వానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. తన నియామకానికి సహకరించిన స్టేషన్‌ఘన్‌పూర్ శాసనసభ్యుడు కడియం శ్రీహరి, వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య, జనగామ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు లకావత్ ధన్వంతి, చిల్పూర్‌గుట్ట దేవస్థానం చైర్మన్ పొట్లపల్లి శ్రీధర్ రావుతో పాటు రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ, మండల నాయకులు, కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు.
పార్టీ అప్పగించిన బాధ్యతను గౌరవంగా భావిస్తున్నానని, నాయకత్వం సూచనలు పాటిస్తూ కార్యకర్తల సహకారంతో ముందుకు సాగుతానని నాగరాజ్ గౌడ్ తెలిపారు. పార్టీ కార్యక్రమాలతో పాటు ప్రజా సమస్యలపై నిరంతరం స్పందిస్తూ తన బాధ్యతను నిర్వర్తిస్తానని స్పష్టం చేశారు.
ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు నాగరాజ్ గౌడ్‌ను అభినందించి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ, మండల స్థాయి నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

📄 Generate e-Paper Clip
Share This Article