విద్యార్థుల ప్రాణాల కంటే యాజమాన్యాల లాభాలే ముఖ్యమా..? ఫిట్నెస్ లేని బస్సులపై ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలి….PDSU జిల్లా అధ్యక్షుడు పుల్లూరి సింహాద్రి

Fasiuddin Mohammed
1 Min Read

రాయల్ పోస్ట్ న్యూస్ సూర్యాపేట ఆగస్ట్ 3/ సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రైవేటు పాఠశాలల బస్సులు ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా నడిపిస్తూ ఉన్నటువంటి యాజమాన్యంపై చట్టపరమైన చర్యలు తీసుకొని బస్సులను సీజ్ చేయాలని పి.డి.ఎస్.యు ఆధ్వరంలో జిల్లా రవాణా శాఖ అధికారి పురుషోత్తం రెడ్డి గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది.ఈ సందర్భంగా పి.డి.ఎస్.యు జిల్లా అధ్యక్షుడు పుల్లూరి సింహాద్రి మాట్లాడుతూ, జిల్లాలో అనేక ప్రైవేట్ పాఠశాలలు ఫిట్నెస్ సర్టిఫికెట్లు లేని బస్సులను నడుపుతూ విద్యార్థుల ప్రాణాలను ప్రమాదంలోకి నెడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. కొన్ని స్కూల్ బస్సులు నిబంధనలకు విరుద్ధంగా అధిక సంఖ్యలో విద్యార్థులను తరలించడం, కనీస భద్రతా ప్రమాణాలను పాటించకపోవడం, సరైన నిర్వహణ లేకుండా రోడ్లపై నడపడం అత్యంత ప్రమాదకరమని పేర్కొన్నారు.
ప్రతిరోజూ వేలాది మంది విద్యార్థులు ఈ బస్సుల ద్వారా ప్రయాణిస్తున్న నేపథ్యంలో ఏదైనా ప్రమాదం జరిగితే దానికి సంబంధిత స్కూల్ యాజమాన్యాలతో పాటు పర్యవేక్షణలో నిర్లక్ష్యం వహించిన అధికారులే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు.
అందువల్ల జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రైవేట్ స్కూల్ బస్సులపై ప్రత్యేక తనిఖీలు నిర్వహించి ఫిట్నెస్ సర్టిఫికెట్లు, బీమా, పర్మిట్లు మరియు ఇతర చట్టబద్ధ పత్రాలను క్షుణ్ణంగా పరిశీలించాలని కోరారు. ఫిట్నెస్ లేని బస్సులను వెంటనే సీజ్ చేసి, నిబంధనలు ఉల్లంఘిస్తున్న ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. భవిష్యత్తులో ఇటువంటి ఉల్లంఘనలు పునరావృతం కాకుండా పటిష్టమైన పర్యవేక్షణ వ్యవస్థను అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు.
విద్యార్థుల ప్రాణ భద్రత విషయంలో అధికారులు ఏమాత్రం నిర్లక్ష్యం వహించకుండా తక్షణ చర్యలు చేపట్టాలని, లేకపోతే విద్యార్థులు, తల్లిదండ్రులతో కలిసి ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో పి.డి.ఎస్.యు నాయకులు ప్రవీణ్, అంజి, ఉపేందర్, నవీన్ తదితరులు పాల్గొన్నారు.

📄 Generate e-Paper Clip
Share This Article