68 మంది సభ్యులతో కమిటీ వివరాలు రాష్ట్ర నాయకత్వానికి విజ్ఞప్తి

- గజ్వేల్‌లో గ్రూపు రాజకీయాలు లేవు..
- రాబోయే ఎన్నికల్లో బీజేపీ జెండా ఎగరేయడమే లక్ష్యం
- బీజేపీ రాష్ట్ర నాయకులు ధరమ్ గురువారెడ్డి
గజ్వేల్, 19 జూలై 2026 రాయల్ పోస్ట్ న్యూస్ /
బీజేపీ రాష్ట్ర, జిల్లా కమిటీల్లో పార్టీ కోసం కష్టపడి పనిచేసిన కార్యకర్తలకు తగిన స్థానం కల్పించాలని రాష్ట్ర కమిటీ దృష్టికి తీసుకెళ్లినప్పటికీ, ఆ అంశం పరిశీలనలో ఉండగానే జిల్లా అధ్యక్షుడు ఎవరినీ సంప్రదించకుండా కమిటీలను ఏర్పాటు చేశారని బిజెపి రాష్ట్ర నాయకులు ధరం గురువారెడ్డి ఆదివారం గజ్వేల్ నియోజకవర్గం బీజేపీ కార్యకర్తల సమావేశంలో ఆరోపించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ పరిణామంతో గజ్వేల్ నియోజకవర్గానికి చెందిన పలువురు బీజేపీ కార్యకర్తలు అసంతృప్తికి గురయ్యారని ఆయన తెలిపారు. నియోజకవర్గంలోని వందలాది మంది కార్యకర్తలను ఒకే వేదికపైకి తీసుకువచ్చి, పార్టీ బలోపేతం లక్ష్యంగా 68 మంది సభ్యులతో ప్రత్యేక నియోజకవర్గ కమిటీని ఏర్పాటు చేసి, ఆ కమిటీ వివరాలను రాష్ట్ర కమిటీకి పంపినట్లు వెల్లడించారు. ఈ కమిటీ రాష్ట్ర కమిటీతో సమన్వయంగా పనిచేయడానికి సిద్ధంగా ఉందని, రాష్ట్రంలోనే కార్యకర్తల బలం అత్యధికంగా ఉన్న నియోజకవర్గంగా గజ్వేల్‌ను తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామని తెలిపారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో గజ్వేల్‌లో బీజేపీ జెండా ఎగరవేసేలా పనిచేస్తామని, అందుకోసం ఈ నియోజకవర్గ కమిటీకి రాష్ట్ర కమిటీ ఆమోదం తెలపాలని విజ్ఞప్తి చేశారు. నియోజకవర్గంలో చేపట్టాల్సిన కార్యాచరణపై చర్చించేందుకు గజ్వేల్ పట్టణంలో బీజేపీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశాన్ని నిర్వహించినట్లు తెలిపారు. సమావేశంలో ఆమోదించిన తీర్మానాలను రాష్ట్ర కమిటీ దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు. తమ కమిటీపై కొందరు కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారని, గజ్వేల్ బీజేపీలో ఎలాంటి గ్రూపు రాజకీయాలు లేవని స్పష్టం చేశారు. పార్టీ కోసం కష్టపడి పనిచేసే కార్యకర్తలందరికీ ఈ కమిటీలో స్థానం కల్పించామని పేర్కొన్నారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో గజ్వేల్ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలిపించి రాష్ట్ర కమిటీకి బహుమతిగా అందిస్తామని ధరం గురువారెడ్డి ధీమా వ్యక్తం చేశారు. గజ్వేల్ నియోజకవర్గ ప్రజా సమస్యలపై బీజేపీ ప్రజల తరఫున నిరంతరం పోరాటం చేస్తుందని, త్వరలోనే పలు భారీ కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు వెల్లడించారు. రాష్ట్ర కమిటీ ఈ నియోజకవర్గ కమిటీకి ఆమోదం తెలిపి జిల్లా కమిటీతో కలిసి పనిచేయాలని సూచిస్తే పూర్తి సమన్వయంతో ముందుకు సాగుతామని అన్నారు. ఒకవేళ ఆమోదం లభించకపోయినా ప్రజల సమస్యలపై ప్రజల తరఫున తమ పోరాటం కొనసాగుతుందని ధరం గురువారెడ్డి స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో బిజెపి గజ్వేల్ నియోజకవర్గ అధ్యక్షులు కుడిక్యాల రాములు, సీనియర్ నాయకులు ఉప్పల మధుసుదన్, బండారు మహేష్, వెంకట్ రెడ్డి, పవన్, స్వామి, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.