రాయల్ పోస్ట్ న్యూస్ భువనగిరి జులై 18/బీబీనగర్ మండలం బ్రాహ్మణపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన మాజీ ఎమ్మెల్యే స్వర్గీయ కొమ్మిడి నర్సింహా రెడ్డి దశదిన కర్మ కార్యక్రమంలో భువనగిరి నియోజకవర్గ శాసనసభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి పాల్గొని వారికి నివాళులర్పించారు. అనంతరం నిర్వహించిన సంతాప సభలో పాల్గొని వారి సేవలను స్మరించుకున్నారు. ఈ సందర్భంగా కొమ్మిడి నర్సింహా రెడ్డి స్మారక సంచికను ఎమ్మెల్యే ఆవిష్కరించారు.


ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, స్వర్గీయ కొమ్మిడి నర్సింహా రెడ్డి ప్రజల సంక్షేమం కోసం జీవితాంతం కృషి చేసిన గొప్ప నాయకుడని కొనియాడారు. సుమారు 300 ఎకరాల భూమిని ప్రజా ప్రయోజనాల కోసం దానం చేసిన మహోన్నత వ్యక్తి అయినప్పటికీ, ఆయనకు స్వంత ఇల్లు కూడా లేకపోవడం ఆయన త్యాగనిరతికి నిదర్శనమని పేర్కొన్నారు.
2001 సంవత్సరంలోనే పిల్లాయిపల్లి–బునాది కాలువ సర్వే పనుల కోసం స్వంత డబ్బులను వెచ్చించి అభివృద్ధికి బాటలు వేసిన దూరదృష్టి గల నాయకుడు కొమ్మిడి నర్సింహా రెడ్డి అని గుర్తు చేశారు.
వారి సేవలకు గుర్తింపుగా బొల్లెపల్లి కాలువకు స్వర్గీయ కొమ్మిడి నర్సింహా రెడ్డి పేరును పెట్టేలా రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి ని కోరుతున్నామని ఎమ్మెల్యే తెలిపారు. అలాగే భువనగిరి పట్టణ కేంద్రంలో స్వర్గీయ కొమ్మిడి నర్సింహా రెడ్డి విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకుంటామని ప్రకటించారు.
ప్రజా సేవలో ఆయన చూపిన నిబద్ధత, త్యాగం, అభివృద్ధి పట్ల ఉన్న అంకితభావం భావితరాలకు ఆదర్శంగా నిలుస్తాయని ఎమ్మెల్యే పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో భువనగిరి నియోజకవర్గ ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు మరియు అభిమానులు పాల్గొన్నారు…